రెడ్‌క్రాస్ ఆనందనిలయంలో ఎథిక్ అకాడమీ ‘ది ఎంపతీ ఫెస్ట్ – 2026’

0
1

మంచిర్యాల: విద్యార్థుల్లో సేవాభావం, సహానుభూతి, సామాజిక బాధ్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఎథిక్ అకాడమీ – ది ఎలిమెంటరీ స్కూల్ ఆధ్వర్యంలో ‘ది ఎంపతీ ఫెస్ట్ – 2026’ కార్యక్రమాన్ని రెడ్‌క్రాస్ ఆనందనిలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు మానవత్వపు విలువలను ఆచరణలో చూపిస్తూ వృద్ధులతో ఆత్మీయంగా గడిపారు.

ఈ సందర్భంగా విద్యార్థులు దుప్పట్లు, బియ్యం, నిత్యావసర సరుకులను ఆనందనిలయానికి అందజేశారు. అక్కడి వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడి వారి జీవిత అనుభవాలను తెలుసుకున్నారు. వారితో కలిసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అంతేకాకుండా ఇళ్లలో ఉపయోగించకుండా ఉన్న మంచి స్థితిలోని దుస్తులు, బొమ్మలు, పుస్తకాలను స్వచ్ఛందంగా సేకరించి అవసరమైన వారికి అందించేలా ముందుకొచ్చారు.

ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ చరణ్ రెడ్డి మాట్లాడుతూ, “మంచి మార్కులు సాధించడంతో పాటు మంచి మనుషులుగా ఎదగడం కూడా విద్యలో భాగమే. చిన్నతనం నుంచే పిల్లల్లో పంచుకునే గుణం, సేవాభావం, మానవత్వం పెంపొందించడమే మా లక్ష్యం. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక స్పృహను, ఇతరుల పట్ల బాధ్యతను పెంచుతాయి” అని తెలిపారు.

కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సభ్యులు మదుసుధన్ రెడ్డి, సత్యపాల్ రెడ్డి, సురభి శరత్ కుమార్, సత్యనారాయణ రెడ్డి, ఏడ్ల కిషన్, సీనియర్ అడ్వకేట్ నాగిరెడ్డి మల్లారెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మి రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.