SRP-3 గని మహిళా పిట్ కమిటీ ఎన్నిక.. కార్యదర్శిగా నాంపెల్లి స్రవంతి

0
2

శ్రీరాంపూర్: సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలోని SRP-3 గనిలో మహిళా పిట్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నవంబర్ 21, శనివారం శ్రీరాంపూర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మహిళా కమిటీ జనరల్ బాడీ సమావేశంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య హాజరయ్యారు.

జనరల్ బాడీ సమావేశంలో మహిళా పిట్ కార్యదర్శిగా నాంపెల్లి స్రవంతి, అసిస్టెంట్ పిట్ కార్యదర్శులుగా కొంకట సువర్ణ, అయిత అనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (AITUC) కార్మికుల సమస్యలతో పాటు మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక గదులు, వాష్‌రూమ్‌లు, పిల్లల సంరక్షణ కోసం క్రచ్ రూమ్‌ల ఏర్పాటు విషయంలో యూనియన్ పోరాటం చేస్తోందన్నారు.

SRP-3 గనిలో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం ఉన్న ప్రత్యేక గది సరిపోవడం లేదని, వెంటనే గదిని విస్తరించి విధులకు ముందు, అనంతరం విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని యాజమాన్యాన్ని కోరారు.

మహిళా ఉద్యోగుల హక్కులు, సౌకర్యాల సాధన కోసం యూనియన్ అన్ని గనులు, డిపార్ట్‌మెంట్లలో పిట్ కమిటీలు, ఏరియా కమిటీతో పాటు మహిళా కేంద్ర కమిటీని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతోందని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘం బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, SRP-3 పిట్ సహాయ కార్యదర్శి అంబాల రవి, మహిళా నాయకురాళ్లు సునీత, మంజుల, శరణ్య, సాయి శ్రీ, మహేశ్వరి, సంధ్యారాణి, శైలజ, నవ్య, కవిత, రజిత తదితరులు పాల్గొన్నారు.