మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆల్వాల్ హిల్స్ కమిటీ హాల్‌లో ప్రజల్లో భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక ప్రజా అవగాహన – ప్రజా భద్రత కార్యక్రమం నిర్వహించారు.
ఆల్వాల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, యువత, మహిళలు మరియు కాలనీ ప్రతినిధులు హాజరయ్యారు.
కార్యక్రమంలో ఆల్వాల్ ఎస్‌ఐ దేవేందర్ మాట్లాడుతూ ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అనుమానాస్పద ఫోన్ కాల్స్, ఫేక్ లింకులు, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు.
సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మోసాలకు గురికాకుండా ఉండవచ్చని తెలిపారు.
అలాగే ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతపై మాట్లాడిన ఆయన హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం వంటి అంశాలను ప్రజలకు వివరించారు.
మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ అందుబాటులో ఉంచిన షీ టీమ్స్, అత్యవసర హెల్ప్‌లైన్ సేవల గురించి కూడా అవగాహన కల్పించారు.
ప్రజల భాగస్వామ్యంతోనే నేర నియంత్రణ సాధ్యమవుతుందని, ఎలాంటి అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
ప్రజల సంక్షేమం, భద్రత లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం స్థానికుల్లో మంచి స్పందన పొందింది.
#Sidhumaroju
Alwal









