యోగా వ్యాప్తికి బాబా రామ్‌దేవ్‌తో కలిసి పనిచేస్తాం… ఉండవల్లి గుహల వద్ద జాతీయ మీడియాతో చంద్రబాబు
20-06-2026 Sat 15:15
Andhra
Chandrababu Naidu will work with Baba Ramdev to spread Yoga says CM at Undavalli Caves
ప్రతి ఇంటికి యోగాను తీసుకెళ్లడమే లక్ష్యమని ప్రకటించిన సీఎం చంద్రబాబు
యోగా వ్యాప్తి కోసం బాబా రామ్‌దేవ్‌తో కలిసి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి
హైదరాబాద్ ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నట్లు కీలక వ్యాఖ్యలు
టెక్నాలజీతో పాటు సంస్కృతి, ఆధ్యాత్మికత యువతకు ముఖ్యమని సూచన
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటికీ యోగాను తీసుకెళ్లడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. యోగాను రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌తో కలిసి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఉండవల్లి గుహల వద్ద శనివారం జరిగిన ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఆయన జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగానే కాకుండా హెల్తీ, వెల్తీ, హ్యాపీ, ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గతంలో తాను నిర్మించిన సైబరాబాద్ తరహాలోనే, ఇప్పుడు అమరావతిని ‘హైదరాబాద్ ప్లస్’గా నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
“సైబరాబాద్ నిర్మాణం తర్వాత అమరావతిని నిర్మించే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. తెలంగాణకు హైదరాబాద్ ఎలాగైతే ప్రధాన ఆదాయ వనరుగా మారిందో, అదే స్థాయిలో అమరావతిని అభివృద్ధి చేస్తాం” అని అన్నారు.
టెక్నాలజీని అనుసంధానిస్తూనే, అమరావతిని ఒక నాలెడ్జి హబ్‌గా తీర్చిదిద్దుతామని వివరించారు. యోగా అనేది ప్రపంచానికి భారత్ ఇచ్చిన అమూల్యమైన బహుమతి అని, దాని ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించి ఏకాగ్రత సాధించవచ్చని తెలిపారు. టెక్నాలజీ ఒక్కటే సంపదను సృష్టించదని, భారతదేశానికి ఉన్న అసలైన శక్తి సంస్కృతి, ఆధ్యాత్మికత అని అన్నారు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ యువత ముందుకు సాగాలని చంద్రబాబు సూచించారు.










