చింతూరు మండలం తిమ్మరిగూడెం గ్రామానికి చెందిన సునీత అనే గర్భిణికి శనివారం అకస్మాత్తుగా ప్రసవ వేదన మొదలైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి (CHC) తరలించారు.అయితే అక్కడ పరిస్థితి కాస్త సంక్లిష్టంగా మారడంతో, మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు ఆమెను భద్రాచలం ఆసుపత్రికి రిఫర్ చేశారు. సమయం లేదు..
నొప్పులు ఎక్కువవుతున్నాయి.. వెంటనే 108 వాహనంలో ఆమెను భద్రాచలం తరలించే ప్రయత్నం చేశారు.ప్రయాణం సాగుతుండగానే.. మార్గం మధ్యలో సునీతకు నొప్పులు తీవ్రమయ్యాయి. 108 సిబ్బంది అయిన ఎం. వెంకట్, ఏ. వెంకట్ ఏమాత్రం కంగారు పడకుండా చాకచక్యంగా వ్యవహరించారు. వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి, అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు.సిబ్బంది సమయస్ఫూర్తితో సునీత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు. సకాలంలో స్పందించి ఇద్దరి ప్రాణాలను కాపాడిన 108 సిబ్బందిపై స్థానికులు మరియు కుటుంబ సభ్యులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
# Yadagiri










